Sunday, March 13, 2011

జపాన్‌ సునామీ ముప్పుని దీటుగానే ఎదుర్కుందా?


నిజానికి సునామీ అనే పదం జపాన్‌ భాషలోనిదే. 18వ శతాబ్దపు ప్రముఖ చిత్రకారుడు హొకుసాయి.. ఒక సునామీ అల మౌంట్‌ ఫుజీని ముంచెత్తడాన్ని చిత్రీకరించారు. ఇది అక్కడ ఈ విపత్తులపై ఎంత తీవ్రంగా ఆలోచిస్తారనేదానికి నిదర్శనం. ఈ విపత్తులను తట్టుకోవడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సునామీ తీరుతెన్నులను అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేక ఇంజినీరింగ్‌ విభాగాన్ని అక్కడి విశ్వవిద్యాలయాల్లో ఏర్పాటు చేశారు. అందువల్లే అక్కడ ప్రాణ నష్టం తక్కువగా ఉంటుంది.

* 1952 నుంచే సునామీ హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. జపాన్‌ ద్వీపాల వద్ద దాదాపు 300 సెన్సర్లు అమర్చారు. ఇవి భూకంపాలను కలిగించే సైస్మిక్‌ తరంగాలను నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. కనీసం 10 నిమిషాల ముందు ప్రజలకు హెచ్చరిక ఇస్తారు. ప్రత్యేక ఛానళ్ల ద్వారా సహాయ సిబ్బందికి సమాచారం చేరవేస్తారు.

* భూకంపాలు, సునామీలు తట్టుకునేలా గట్టి భవన నిర్మాణ చట్టాలు అక్కడ ఉన్నాయి.

* జనం ఎక్కువగా నగరాలకు సమీపంలోని తీరాల వద్ద 4.5 మీటర్ల ఎత్తయిన సునామీ గోడలను నిర్మించింది.

* సునామీ అలల వల్ల తీరంలోకి చొచ్చుకొచ్చిన నీటిని దారి మళ్లించడానికి ప్రత్యేక కాలవలను నిర్మించారు.


హెచ్చరికలిలా...అకస్మాత్తుగా విరుచుకుపడే సునామీ ఉపద్రవం నుంచి బయటపడేదెలా? అడ్డుకోలేని సునామీని ముందస్తుగా గుర్తించగలిగితే ప్రాణనష్టమైనా ఆపగలుగుతామన్న లక్ష్యంతో పలు దేశాలు... సునామీ ముందస్తు హెచ్చరికల కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ విషయంలో ప్రధానంగా రెండు అంశాలపై దృష్టి పెడుతున్నాయి. ఒకటి సునామీలను ముందుగా గుర్తించడం, సకాలంలో తీరప్రాంత ప్రజలను ఖాళీ చేయించేలా సమాచారం అందించడం. ఈ రెండు ప్రధాన లక్ష్యాల ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు.

*సునామీ హెచ్చరికలు రెండు రకాలుగా విభజించారు. ఒకటి ప్రాంతీయం, రెండు అంతర్జాతీయం.

*సముద్ర జలాల ప్రయాణ వేగం, భూ ప్రకంపనల వేగాన్ని పరిగణనలోకి తీసుకుని సునామీపై అంచనాకు వచ్చి... ప్రభావితమయ్యే ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేస్తారు.

*హవాయిలో తొలిసారిగా 1920లో ముందస్తు సునామీ హెచ్చరిక జారీచేశారు. 1946లో అభివృద్ధి చెందిన వ్యవస్థను కనుగొన్నారు.

*పసిఫిక్‌ మహా సముద్రంలో వస్తున్న వచ్చే సునామీలపై హెచ్చరికల కోసం హవాయిలో 'పసిఫిక్‌ సునామీ హెచ్చరికల కేంద్రం' (పీటీడబ్ల్యూసీ) ఏర్పాటు చేశారు. దీన్ని అమెరికా నిర్వహిస్తోంది.

*అలాస్కాలో 'అలాస్కా సునామీ హెచ్చరిక'ల కేంద్రం ఉంది. ఉత్తర అమెరికాలో పశ్చిమ తీరంలో సంభవించే సునామీలపై ఇది సమాచారం ఇస్తుంది.

*భారత్‌లోని హైదరాబాద్‌లో భారత సముద్ర సమాచార సేవల కేంద్రం(ఇన్‌కాయిస్‌) సునామీహెచ్చరికల కేంద్రంగా పనిచేస్తోంది.

*కరేబియన్‌ దీవుల ప్రాంతంలో వచ్చే సునామీలపై హెచ్చరికల కోసం ఒక కేంద్రం 2010లో ఏర్పాటయ్యింది.

*అత్యంత ఆకస్మికంగా వచ్చే సునామీల నుంచి ఏ వ్యవస్థా ప్రజలను కాపాడలేదన్నది నిపుణుల వాదన. ముఖ్యంగా భూకంప కేంద్రం తీర ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్నప్పుడు ప్రమాదం నివారించడం సాధ్యం కాదు. 1993 జులై 12న జపాన్‌లో వచ్చిన ఆకస్మికంగా సునామీ సంభవించి 212 మంది మృత్యువాత పడ్డారు.

*ఒక ప్రాంతంలో సునామీ వచ్చినప్పుడు దాని ప్రభావం ఇతర దూరతీరాలకు చేరే సందర్భంలో కొన్ని గంటల ముందుగా హెచ్చరికలు జారీచేసే వీలుంటుంది.
ముప్పును పసిగట్టి..
తొలి హెచ్చరిక: భూకంప తొలి ప్రకంపనలను సునామీ ప్రాథమిక హెచ్చరికలుగా గుర్తించాలి. ఇవి ఏర్పడినప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

సముద్రం వెనక్కు: ఒక్కోసారి అకస్మాత్తుగా సముద్రం కొంత మేర వెనక్కు వెళుతుంది. సముద్ర మట్టం పెరగడం, తగ్గడం జరుగుతుంది. వీటిని సునామీ రాకకు హెచ్చరికగా భావించాలి. స్థానికులు తీరానికి కనీసం 4 మైళ్ల దూరంవెళ్లి తలదాచుకోవాలి.

పెద్ద శబ్దం: సునామీ తీరం వైపు వస్తున్నపుడు రైలు లేదాజెట్‌ విమానం దూసుకొస్తున్నపుడు వెలువడే శబ్దం మాదిరి వినిపిస్తుంది.

*తీరాన్ని తాకే తొలి సునామీ కెరటం అంత ప్రమాదమైంది కాదు. కానీ, దాని తర్వాత వివిధ కాలవ్యవధుల్లో ఎగసిపడే కెరటాలు భారీ నష్టాన్ని కలగజేస్తాయి. అధికారులు చెప్పేవరకూ సముద్రం దగ్గరకు వెళ్లకూడదు.
* ఒకచోట సునామీ అల తక్కువ తీవ్రతతో ఉన్నంత మాత్రాన దాన్ని తక్కువగా అంచనావేయకూడదు. అలల శక్తి ఒక్కో ప్రాంతంలో ఒక్కోతరహాలో ఉంటుంది.
* సునామీ కెరటంపై ఎప్పుడూ సర్ఫింగ్‌ చేయకూడదు.

No comments:

Post a Comment